పారదర్శకంగా ఓటరు జాబితా
● కలెక్టర్ హైమావతి
● రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
సిద్దిపేటరూరల్: ఓటరు జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్‌తో కలసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా తయారీకి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి బీఎల్‌ఎస్‌ను అపాయింట్ చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
భూభారతిలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన సాదాబైనామా, ఇతరత్రా దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం మార్గదర్శకాల మేరకు క్షేత్ర పరిశీలన చేసి పరిష్కారం చేయాలన్నారు. అవసరమైన గ్రామాల్లో అంగన్‌వాడీ సెంటర్, గ్రామ పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారు చేపడుతున్న పనులపై శుక్రవారం ఈఈ, డీఈ, ఏఈలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, పీహెచ్‌సీ సబ్‌సెంటర్లు, మహిళా సమాఖ్య భవనాలు, మినీ ఫంక్షన్‌హాల్, డ్రైనేజీ ఇతర పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులు పూర్తి కాగానే ఎఫ్‌టీఓ జనరేట్ చేయాలన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మించాలన్నారు. సమావేశంలో ఈఈ శ్రీనివాస్, డీఈ చిరంజీవులు, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, డీడబ్ల్యూఓ శారద పాల్గొన్నారు.


