ప్రజలను ఏకం చేసిన గీతం
సిద్దిపేటరూరల్: స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలను ఏకం చేయడంలో వందేమాతరం గీతం ముఖ్య పాత్ర పోషించిందని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వందేమాతరం గీతం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలన సమయంలో దేశంలోని కవులందరూ ప్రజలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. అందులో భాగంగానే బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించారన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్ర, క్విట్ ఇండియా, దండి యాత్ర వంటి ఎన్నో ఉద్యమాల్లో ఈ గీతం ముఖ్య నినాదంగా నిలిచిందన్నారు. భవిష్యత్తు తరాలకు వందేమాతరం గీతం గొప్పతనాన్ని స్మరించేలా అందరం కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, అధికారులు, కలెక్టరేట్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను ఏకం చేసిన గీతం


