 
															కన్నీటి వరద
కొట్టుకుపోయిన 88 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన150 మెట్రిక్ టన్నుల ధాన్యం 11 మండలాల్లో 2,515 ఎకరాల్లోపంట నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ అన్నదాతల కన్నీటిపర్యంతం
రైతన్నను నట్టేట ముంచిన మోంథా
మోంథా తుపాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయంలో నోటికాడి బువ్వను లాక్కున్నట్లయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో వడ్లు, మక్కలు నీటిపాలయ్యాయి. కళ్లెదుటే చేతికొచ్చిన పంట నీటిపాలవుతుంటే రైతులు గుండెలు బాదుకున్నారు. జిల్లాలో అత్యధికంగా హుస్నాబాద్‌లో 30.04 సెంటీమీటర్లు, అక్కన్నపేట మండలం కట్కూరులో 28.25 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
–సాక్షి, సిద్దిపేట
నేడు సీఎం ఏరియల్ సర్వే
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో పంట నష్టంపై శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేను నిర్వహించనున్నారు. సీఎం వెంట మంత్రులు సైతం ఉండనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,666 మంది రైతులకు చెందిన 2,515 ఎకరాల పంటలకు నష్టం జరిగింది. వరి 2,214, పత్తి 301 ఎకరాల్లో తీరని నష్టం చోటుచేసుకుంది. అందులో అత్యధికంగా కోహెడ మండలంలో 855, నంగునూరు మండలంలో 706 ఎకరాలు, అక్కన్నపేటలో 530 ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ ఏడాది పత్తి రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి. పత్తిపంట పూర్తిగా దెబ్బతిని చేతికి అందకుండా పోతోంది. తరచూ వర్షాలు, మబ్బులకు తోడు సరిపడా ఎండపడక పత్తికాయలు విచ్చుకోవడం లేదు. కొన్ని చోట్ల చెట్ల మీదనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత పంటల పరిస్థితి ఏమిటి? తర్వాత కోలుకుంటాయా? లేకపోతే మొత్తం నష్టపోయినట్లేనా? పంట నష్టం ఎంత శాతం జరిగింది? అనే దానిపై మరో మారు వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించనున్నారు.
88 మెట్రిక్ టన్నుల ధాన్యం వరదపాలు
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నడుము లోతు వరద నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 23 మంది రైతులకు చెందిన 88 మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిపాలైంది. అలాగే 83 మంది రైతులకు చెందిన 150 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది.
నిలిచిన రాకపోకలు
జిల్లాలో పలు చోట్ల రోడ్లపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముస్త్యాల వద్ద రాగికుంట పొంగిపొర్లడంతో చేర్యాల నుంచి హుస్నాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. కల్వర్టు కొట్టుకుపోయింది.
కష్టమంతా నీటిపాలాయె..
ఆరుగాలం పడిన రెక్కల కష్టమంతా నీటిపాలైంది. మార్కెట్‌కు ఆరు ట్రాక్టర్ల ధాన్యం తెస్తే నాలుగు ట్రాక్టర్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్‌కు వెళ్తే ఎలాంటి సౌలతులు ఉండవని చెప్పినా మా ఆయన వినలేదు. తడిసిన ధాన్యం తీసుకోకపోతే చనిపోవడమే దిక్కు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– భూక్య లీల, జిల్లెల్లగడ్డ, హుస్నాబాద్
పత్తి తడిసిపోయింది
వర్షాలకు పత్తి తడిసి ముద్దయింది. రెండెక రాలలో పత్తి పంట సాగు చేశా. ఎదిగే సమయంలో వర్షం పడటంతో దెబ్బతిన్నది. తడిచిన పత్తిని చూస్తే కూలీల ఖర్చు కూడా వచ్చేటట్లు లేదు. ఇప్పటి వరకు రూ.80వేల పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం ఆదుకోవాలి.
– బునారి భాస్కర్, తిగుల్, జగదేవ్‌పూర్
మార్కెట్‌ను ముంచెత్తిన
వాన
వరదలో కొట్టుకుపొయిన ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. రైతులకు శాపం
హుస్నాబాద్: మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యమంతా నీటిపాలైంది. ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకుండాపోయింది. ఫ్లాట్ ఫామ్‌లపై ఆరబోసిన ధాన్యం కూడా తడిసి పోయింది. వర్షం ధాటికి వ్యవసాయ మార్కెట్ అతలాకుతలమైంది. మార్కెట్‌ను కుంటలో నిర్మించారు. దీంతో పోతారం (ఎస్) గ్రామం నుంచి వచ్చే వరద నీరు మార్కెట్‌ను ముంచెత్తడం, వరద నీటి కాలువలు సరిగా లేకపోవడంతో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. దాదాపు 15 రోజుల నుంచి ఆరబోసిన ధాన్యానికి తేమ 12 శాతం ఉంటేనే కాంటా పెడతామని అధికారులు కొర్రీలు పెట్టడం రైతులకు శాపంగా మారింది. రాత్రి సమయంలో చిమ్మరి చీకటిలో వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. అధికారులు మార్కెట్ ప్రహారీ గోడను పగుల గొట్టి ఽనీటిని బయటకు వదిలారు. అప్పటికే జరిగిన నష్టం జరిగిపోయింది.
కొట్టుకుపోయిన 1500 క్వింటాళ్ల ధాన్యం
మార్కెట్‌లో రైతులు 106 ధాన్యం కుప్పలు పోశారు. ఇందులో 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక, మురికి కాలువల్లో చెత్త పోరుకుపోవంతో నీరంతా ధాన్యం కుప్పలు తడిపి వేస్తున్నాయి. మార్కెట్‌లో నిర్మించిన గోధాముల్లో ధాన్యం ఆరబెట్టుకునే అవకాశం కల్పిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. ఆరబెట్టిన ధాన్యం మధ్యాహ్నం వరకు ఎండటం, రాత్రి అయిందంటే మంచు కమ్ముకోవడం, అనుకున్న తేమ శాతం రాకపోవడంతో రోజుల తరబడి మార్కెట్‌లోనే ఉంటున్న పరిస్థితి.
మురికి కాలువల నుంచి ధాన్యం ఎత్తి..
ధాన్యమంతా మురికి కాలువల్లోకి కొట్టుకుపోయాయి. దీంతో కాలువల్లో ఉన్న ధాన్యాన్ని జేసీబీ సహాయంతో, తట్టలతో ఎత్తిపోసుకుంటూ రైతులు అరిగోస పడ్డారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి వ్యవసాయ క్షేత్రం వద్ద స్థలం లేదని మార్కెట్‌కు వస్తే వరుణుడు పగబట్టినట్లు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొట్టుకుపోయిన 10 ట్రాక్టర్ల ధాన్యం
కోహెడరూరల్(హుస్నాబాద్): మోంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో వంతెనపై ఆరబోసిన పది ట్రాక్టర్ల ధాన్యం మోయతుమ్మెద వాగు వరదలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ధాన్యం కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు.
అక్కన్నపేట మండలం జనగామలో దుస్థితి
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నీట మునిగిన ధాన్యం కుప్పలు
 
							కన్నీటి వరద

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
