 
															30ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు
డీఎంహెచ్‌ఓ ధనరాజ్
సిద్దిపేటకమాన్: ముప్పై ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో పీహెచ్‌సీల సూపర్‌వైజర్లతో డీఎంహెచ్‌ఓ గురువారం సమావేశం నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, సంక్రమిత వ్యాధుల వంటి కార్యక్రమాల అమలును పరిశీలించారు. పలు విభాగాల్లో తక్కువ ప్రగతి నమోదైన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 వారాల్లోపు గర్భిణులను తప్పనిసరిగా నమోదు చేయాలని, హైరిస్క్ వారిని గుర్తించి 102 వాహనం ద్వారా సమగ్ర వైద్య సదుపాయాలున్న ఆస్పత్రులకు తరలించాలన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
