 
															అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
● రైతులకు మంత్రి పొన్నం భరోసా ● వరద ప్రాంతాల్లో పర్యటన
కోహెడరూరల్(హుస్నాబాద్): అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లి గ్రామాల్లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని, తెగిపోయిన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరదలతో మునిగిన వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన పంటలను పరిశీలించి రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం కావడం బాధాకరమని అన్నారు. పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకొని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
తడిసిన ధాన్యాన్ని కొంటాం
హుస్నాబాద్‌రూరల్: ఎన్నడూ లేని విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షం కురిసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలన్నారు. రైతులను ఆదుకోవడంలో రాజకీయాలను పక్కన పెట్టి రైతుకు భరోసా కల్పించాలన్నారు. మార్కెట్‌లో వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని, వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులకు జరిగిన నష్టంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎంకు వివరించినట్లు చెప్పారు.
కోహెడ మండలంలో దెబ్బతిన్న రోడ్డును, తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం
 
							అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
