వానొస్తే.. బస్టాండ్‌ మునకే | - | Sakshi
Sakshi News home page

వానొస్తే.. బస్టాండ్‌ మునకే

Oct 31 2025 11:41 AM | Updated on Oct 31 2025 11:41 AM

వానొస్తే.. బస్టాండ్‌ మునకే

వానొస్తే.. బస్టాండ్‌ మునకే

ఆధునీకరణ దేవుడెరుగు..వరద సంగతేమిటీ? ఇంకా నీటిలోనే హుస్నాబాద్‌ బస్టాండ్‌ ప్రాంగణం

హుస్నాబాద్‌: వానొస్తే వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగుతాయి.. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్‌ సైతం మునుగుతోంది. భారీ వర్షం కురిసిన ప్రతీసారి ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. హుస్నాబాద్‌ పట్టణంలో దాదాపు 35 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించారు. బస్టాండ్‌ను ఆనుకొని ఉన్న రహదారి అభివృద్ధి కోసం అనేక సార్లు ఎత్తు పెంచి రహదారులను నిర్మించారు. దీంతో రోడ్డు కంటే బస్టాండ్‌ ఎత్తు తగ్గడంతో ప్రతి వర్షానికి బస్టాండ్‌ ప్రాంగణం నీటిలో మునుగుతోంది. బస్టాండ్‌కు వచ్చే నీరు బయటకు వెళ్లే దారి లేదు. జాతీయ రహదారి పేరిట ఈ రోడ్డు ఎత్తును మళ్లీ పెంచారు. బస్టాండ్‌ ఎత్తును పెంచలేదు. వర్షం కురిసినప్పుడల్లా బస్టాండ్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇలాకాలో ఆర్టీసీ బస్టాండ్‌ వరద నీటితో తల్లడిల్లుతోంది. ఇటీవల రూ.2 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన బస్టాండ్‌ను మంత్రి ప్రారంభించారు. బస్టాండ్‌ ఎత్తు పెంచకుండా ఆధునీకరణ పనులు చేపట్టారు. కొత్తగా ప్లాట్‌ ఫాంలు, మూత్రశాలలు, ప్రాంగణాన్ని సీసీతో నింపి వేసి చేతులు దులుపుకున్నారు. బస్టాండ్‌ పై కప్పు నుంచి వర్షం నీరు కారుతోంది. బస్టాండ్‌ను వరద నీటి నుంచి కాపాడాలని అధికారుల వద్ద ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం శోచనీయం. ఇటీవలనే బస్టాండ్‌లోకి వచ్చే నీటిని బయటకు పంపించేందుకు పైపు లైన్లు వేసినా ఫలితం శూన్యం. పట్టణంలోని మెయిన్‌ రోడ్‌పై ప్రవహించే వరద, నాగారం రోడ్డు నుంచి వచ్చే మురికి కాలువల నీరంతా బస్టాండ్‌లోకి వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంగణమే కాకుండా సైకిల్‌ స్టాండ్‌ కూడా మునిగి పోతోంది.

ప్రయాణికులకు నరకమే..

ప్రయాణికులు బస్టాండ్‌కు రావాలన్నా.. బస్సు నుంచి దిగాలన్నా వరద నీటి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో బస్టాండ్‌ను వరద నీటిలో చిక్కుకుంది. బస్టాండ్‌ చెరువును తలపించింది. వరద నీరు ప్లాట్‌ ఫాం దాటి బస్టాండ్‌ లోపలికి చేరుకుంది. నీటిలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గురువారం కూడా బస్టాండ్‌ ప్రాంగణం నీటితో నిండి పోయింది. బస్సులు లోపలికి రాకుండా రోడ్డు పైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం గమనార్హం. వరద నీటికి అడ్డుకట్ట వేయకుండా బస్టాండ్‌కు ఎన్ని రూ.కోట్లు వెచ్చించినా ప్రజా ధనం వృధా అవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు చెబుతున్నారు.

మంత్రి ఇలాకాలోప్రయాణికులకు తప్పని తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement