 
															నష్టం వివరాలు సేకరించండి
● కలెక్టర్ హైమావతి ● తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలోపరిశీలన
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన, కొట్టుకుపోయిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోతారం (ఎస్) గ్రామం నుంచి వరద మార్కెట్‌లోకి రావడంతో ధాన్యం తడిసిందన్నారు. ఆర్టీఓ రామ్మూర్తి, మా ర్కెట్ అధికారులు అప్రమత్తమై ప్రహరీని కూల్చి నీటిని బయటకు పంపించారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ చేపడతామన్నారు.
కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న రైతులు
ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ హైమావతి వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. మార్కెట్ నిండా నీళ్లు ఉన్నాయని, ఎక్కడ ఆరబెట్టుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలని దండం పెట్టి వేడుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
