
● పార్టీ బలోపేతానికి కమిటీలు ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: రాబోయే ‘స్థానిక’ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో బుధ వారం రాత్రి సంస్థాగత సన్నాహక సమావేశం నిర్వహించారు. పరిశీలకుడిగా మల్లాది పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పట్టణ కమిటీతో పాటు అనుబంధ సంఘాల కమిటీలు వేసుకోవాలన్నారు. కమిటీలను సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అనే పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటికే పట్టణంలో ప్రతి వార్డుకు రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. రూ.18 కోట్లతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం స్ధల పరిశీలన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు ఉన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.
అక్కన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. హుస్నాబాద్ నుంచి వయా అక్కన్నపేట, జనగామ హైవే నాలుగు లేన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో 1,240 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 443 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారన్నారు. కానీ మేము మొదటి దశలోనే 3,500 ఇళ్లు ఇస్తున్నామన్నారు. అలాగే మరో మూడు నెలల్లో 3వేల ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యకర్తలందరూ గ్రామాల్లో ఐక్యంగా ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.