
భూభారతితో సత్వర న్యాయం
దౌల్తాబాద్(దుబ్బాక): భూ భారతి చట్టంతో రైతాంగానికి సత్వర న్యాయం అందుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ చట్టంలోని ప్రతి అంశాన్ని వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలన్నీ జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. వారసత్వ భూముల సమస్యలను మ్యుటేషన్ పద్ధతిలో పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మండల, గ్రామ స్థాయిలో పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రైతే దేశానికి రాజు అని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, పీఎసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగ మూర్తి, తహసీల్దార్ చంద్ర శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మేలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): రైతుల సమస్యలు పారదర్శకంగా పరిష్కరించడానికే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మేధావులు, లాయర్లు, రైతు సంఘాలు, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూ భారతి చట్టాన్ని తీసుకరావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకుపైగా సాదా బైనామాలు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లాలో 44 వేలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దార్ నిర్మల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరి
దౌల్తాబాద్‌లో అవగాహన సదస్సు