నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ మేరకు పదిమంది తమ సమస్యలపై అందించిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వాటిని నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు పంపించారు. పరిష్కారానికి అనువుగా ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సివిల్ సప్‌లై, సోషల్‌వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


