నిజాంపేట(మెదక్): మద్యానికి బానిసై మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిధిలోని కల్వకుంట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కల్వకుంట గ్రామానికి చెందిన రావిపల్లి ప్రభాకర్ రెడ్డి(72) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన పాత ఇంట్లో ఉన్న దూలానికి దోతి సహాయంతో ఉరివేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో మద్యపానానికి బానిసై కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాశాడు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
నర్సాపూర్ రూరల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పారట్ల కుమార్ (30) గ్రామ సమీపంలోని నీలగిరి చెట్లలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో మహిళ..
చేగుంట(తూప్రాన్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాసాయిపేట మండలం పులిగుట్ట తండాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... తండాకు చెందిన మాలోత్ సోనీ(50) తన భర్త కాశీరాంలు శనివారం రాత్రి గొడవపడ్డారు. ఈ క్రమంలో అదే రాత్రి సోనీ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగింది. ఆదివారం సమీప రైతులు పొలంలో పడిపోయి ఉన్న సోనీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తండాకు చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మానసిక ఆందోళనతో మనస్తాపానికి గురై..
జిన్నారం (పటాన్‌చెరు): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి కథనం ప్రకారం... శివంపేట్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన రాజు(50) గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగులో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో పాటు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
భార్యతో గొడవపడి భర్త..
హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మానగర్‌లో ఆదివారం వెలుగు చూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన గడ్డి మైసయ్య(55)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు మైసయ్య, కంసమ్మలు వేరుగా నివాసముంటున్నారు. సంసారం విషయంలో రెండు రోజుల క్రితం గొడవపడి భార్య మెదక్‌లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మైసయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. గమనించిన కుమారులు తలుపులు తీసి చూసేసరికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు.
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు..
వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో ఓ బావిలో శవమై తేలింది. ఈ ఘటన మండలంలోని శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చిన్నింగి వెంకమ్మ(75) రెండేళ్ల క్రితం కాలు విరగడంతో నడవలేని స్థితిలో ఉంది. రోజూ మాదిరిగా కోడలు లక్ష్మి శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం ఇచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం చూసేసరికి వెంకమ్మ తన గదిలో లేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. ఆందోళన చెందిన కోడలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్తులతో కలిసి పోలీసులు శివారులో వెతుకుతుండగా ఓ బావిలో శవమై కనిపించింది. వృద్ధురాలి ఒంటిపై ఉండే బంగారు నగల కోసం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు మొదట అనుమానించినా, మృతదేహంపై నగలు ఉన్నాయి. దీంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు బావి వద్దకు ఎలా వెళ్లింది? ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


