ఐక్యంగా ఉద్యమిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ఉద్యమిద్దాం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

తపస్‌ రాష్ట్ర సంఘటన

కార్యదర్శి హనుమంతరావు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని తపస్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని మాధవసదన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వేతన, సర్వీస్‌ నిబంధనలు, ఉద్యోగ భద్రత, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు తపస్‌ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, రాష్ట్ర కోశాధికారి భాస్కర్‌ దేశ్‌, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, చంద్రశేఖర్‌, విజయ్‌కుమార్‌, నరసింహులు, తుక్కప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు

రూ.15 వేలు పింఛన్‌

రాష్ట్ర యువజన సంఘాల సమితి

ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్‌

పటాన్‌చెరు టౌన్‌: తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు రూ.15 వేలు పెన్షన్‌ ఇవ్వాలని రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం దివ్యాంగులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్‌లో 80% పైగా వైకల్యం కలిగిన వారికి దాదాపు రూ.15 వేలు పెన్షన్‌ అందిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి తీవ్ర వైకల్యం కలిగిన వారు 4 నుంచి 5 వేల మంది మాత్రమే ఉంటారని, వారికి రూ.15 వేలు చొప్పున పెన్షన్‌ ఇచ్చినా ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రవికుమార్‌, మహేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పాలిసెట్‌

తుది దశ కౌన్సెలింగ్‌

జహీరాబాద్‌ టౌన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తుది దశ ప్రక్రియ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రంజోల్‌ శ్రీసంగమేశ్వర ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ మునిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొదటి దశలో హాజరుకాని అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ 15న స్లాట్‌ బుకింగ్‌, 16న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20న సీట్ల కేటాయింపు చేపట్టి 23 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాలిసెట్‌ పరీక్షలకు హాజరై ర్యాంక్‌ వచ్చిన అభ్యర్థులు త్వరగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం రంజోల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సంప్రదించాలని మునిగుప్తా పేర్కొన్నారు.

నిబంధనలు

పాటించకుంటే చర్యలే

స్కూల్‌ బస్సు డ్రైవర్ల సమావేశంలో డీఎస్పీ

జహీరాబాద్‌ టౌన్‌: విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఉండాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్‌ బస్సు డ్రైవర్లకు డీఎస్‌పీ సైదానాయక్‌ హెచ్చరించారు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో స్కూల్‌ బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపరాదన్నారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, మేసేజ్‌లు పంపడం చేయరాదని సూచించారు. ప్రధాన కూడళ్ల వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌, అతివేగంగా వెళ్లడం వంటివి చేయవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులను ఎక్కించేటప్పుడు..దింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జహీరాబాద్‌ టౌన్‌ సీఐ శివలింగం, ఎస్సైలు లవకుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement