వర్ష బీభత్సం | - | Sakshi
Sakshi News home page

వర్ష బీభత్సం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

కొండాపూర్‌(సంగారెడ్డి)/నారాయణఖేడ్‌: మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోనే కొండాపూర్‌లో అత్యధికంగా 11.4 వర్షపాతం నమోదైంది. దీంతో గ్రామాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తినష్టం వాటిల్లింది. విద్యుత్‌ స్థంభాలు నేలకొరగడం, విద్యుత్‌ వైరులు తెగిపోవడంతో చాలా గ్రామాలు శనివారం రాత్రి అంధకారంలోనే ఉన్నాయి. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. చెర్ల గోపులారంలో రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో రాత్రంతా ఆ గ్రామం అంధకారంలోనే ఉంది. అదే గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌గౌడ్‌కు సంబంధించిన భవనంపై గోడ కూలిపోయింది. మరో ముగ్గురికి సంబంధించిన రేకుల ఇల్లు నేల మట్టమయ్యాయి. ఇదే కాకుండా గిర్మాపూర్‌లో కూడా రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. గొల్లపల్లిలో గౌరమ్మ, నడిమింటి స్వరూపలకు సంబంధించిన రేకుల షెడ్డు పూర్తిగా గాలికి కొట్టుకుపోయాయి. వీరికి సంబంధించిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఆదివారం సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ అశోక్‌ పరిశీలించి వారికి పునరావసం కల్పించారు. నెలకు సరిపడా రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని డీలర్‌ను ఆదేశించారు. వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చూస్తానని భరోసా కల్పించారు. అదేవిధంగా మండల కేంద్రమైన కొండాపూర్‌, అలియాబాద్‌ గ్రామాల్లో కూడా రేకుల షెడ్డు పూర్తిగా గాలికి కొట్టుకుపోయింది. ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలకు విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలుగడంతో మనూరు మండలం బోరంచ ఇన్‌టెక్‌వెల్‌ నుంచి పలు గ్రామాలకు తాగునీటి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement