ఇక పంచాయతీల విభజన | - | Sakshi
Sakshi News home page

ఇక పంచాయతీల విభజన

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

● ఆదాయం ఆధారంగా గ్రేడింగ్‌ ● కార్యదర్శుల పదోన్నతులకు అవకాశం ● బలోపేతం కానున్న పంచాయతీలు

● ఆదాయం ఆధారంగా గ్రేడింగ్‌ ● కార్యదర్శుల పదోన్నతులకు అవకాశం ● బలోపేతం కానున్న పంచాయతీలు

సంగారెడ్డి జోన్‌: గ్రామ పంచాయతీ పాలన మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందులోభాగంగా పంచాయతీలను ఆదాయం ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదనలు పంపించింది.

ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్‌లు

గ్రామ పంచాయతీల వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయించారు. రూ.19 లక్షల కంటే ఎక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌–1గా, రూ.13 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉన్న వాటిని గ్రేడ్‌–2, రూ.7 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్‌–3, రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్‌–4గా విభజించనున్నారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, 46 జీపీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడంతోపాటు కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 12 కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 613 పంచాయతీలున్నాయి. గ్రేడ్‌– 1 పరిధిలోకి 40, గ్రేడ్‌–2 లోకి 53, గ్రేడ్‌ –3 లోకి 164, గ్రేడ్‌–4 లోకి 356 గ్రామపంచాయతీలను విభజించనున్నారు.

పదోన్నతులకు అవకాశం

గ్రామ పంచాయతీల గ్రేడింగ్‌లుగా విభజన ప్రక్రియ పూర్తయితే జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి. గ్రేడింగ్‌ విభజనతో క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రక్రియను సైతం సవరణ చేయనున్నారు.

మెరుగుపడనున్న పంచాయతీ పాలన

గ్రేడింగ్‌ విధానం అమలుతో పంచాయతీల పాలన వ్యవస్థ మెరుగు పడనుంది. ప్రస్తుతం జిల్లాలో ఇష్టారీతిగా కార్యదర్శులకు పంచాయతీలను కేటాయించారు. ఔట్‌ సోర్సింగ్‌, జూనియర్‌ కార్యదర్శులకు అధిక ఆదాయం వచ్చే పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, పంచాయతీల గ్రేడింగ్‌ వ్యవస్థను కార్యదర్శులు స్వాగతిస్తున్నారు.

జిల్లాలో గ్రేడ్‌ల వారీగా విభజన కానున్న గ్రామ పంచాయతీలు

గ్రేడ్‌ రకం పంచాయతీలు

గ్రేడ్‌–1 40

గ్రేడ్‌–2 53

గ్రేడ్‌–3 164

గ్రేడ్‌–4 356

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement