నారాయణఖేడ్: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండటం ఎంతో కీలకమని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సంవత్ పేర్కొన్నారు. ఖేడ్ పట్టణంలోని జీవన్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నియోజకవర్గంలోని బూత్‌స్థాయి ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఓటుహక్కు రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన విలువైన ప్రజాస్వామ్య హక్కన్నారు. 18 ఏళ్లు నిండిన వారిపేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. వలసలు, మరణాలు, చిరునామా మార్పులవంటి అంశాలపై పూర్తి సమాచారంతో ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని చెప్పారు. ప్రజల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు. అర్హుల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రక్రియకు సంబంధించిన బుక్‌లెట్లను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఫయీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


