అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలి

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్‌ ఆఫీసర్‌

నర్సాపూర్‌: ఓరియంటేషన్‌ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ సూచించారు. శనివారం స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో గురుకులాలకు చెందిన పీఈటీ, పీడీలకు రెండు రోజుల ఓరియంటేషన్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేర్చుకున్న అన్ని అంశాలను విద్యార్థులకు నేర్పించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలని సూచించారు.

కోతుల దాడిలో

ఇద్దరికి గాయాలు

నర్సాపూర్‌: పలు చోట్ల కోతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నర్సాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో, నాల్గవ వార్డులో ఇద్దరు బాలురను కోతులు కరిచాయి. కోతుల దాడిలో పిల్లలకు చేతులకు ,కాళ్లకు, తలపై గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసి ఇంటికి పంపించారు.

మహిళ మెడలో

బంగారు గొలుసు చోరీ

చేగుంట(తూప్రాన్‌): మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన చేగుంటలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చేగుంటకు చెందిన అల్లెంకి ధనలక్ష్మి ప్రతి రోజూ బస్టాండ్‌ సమీపంలో వెంచర్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తుండేది. శనివారం మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న క్రమంలో ఆమె వద్దకు వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి అడ్రస్‌ అడుగుతున్నట్లు నటించి మెడలోని బంగారు గొలుసును బలంగా లాగడంతో ధనలక్ష్మి గొలుసును గట్టిగాపట్టుకుంది. దీంతో పెనుగులాటలో సగం గొలుసు దొంగ చేతికి చిక్కి మిగతా సగం ఆమె చేతిలో మిగిలింది. మరో వ్యక్తి బైక్‌ నడుపుతుండగా గొలుసు దొంగిలించిన వ్యక్తి ఇద్దరు బైక్‌పై పారిపోయారు. ఐదు తులాల గొలుసులో సుమారు మూడు తులాల గొలుసు చోరీ అయిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చైతన్య కుమార్‌ రెడ్డి తెలిపారు.

పేకాట స్థావరంపై దాడులు

9 మంది పై కేసు నమోదు

పటాన్‌చెరు టౌన్‌: పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని చిట్కుల్‌ చెరువు పక్కన ఖాళీ స్థలంలో శుక్రవారం రాత్రి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ. 10,200 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement