నిజాంపేట(మెదక్): చెరువులో స్నానం చేస్తుండగా కాలుజారి నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బచ్చురాజ్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... బచ్చురాజ్‌పల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లయ్య (48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఇటీవల మరణించిన కులస్తుడి దశదిన కార్యక్రమం నిమిత్తం మల్లయ్య స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి వారు వెంటనే చెరువులో గాలించారు. దురదృష్టవశాత్తు అప్పటికే మల్లయ్య ప్రాణాలు కోల్పోవడంతో అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


