చేగుంట(తూప్రాన్): తిరుపతి దర్శనం కోసం వెళ్లిన ఆరేళ్ల బాలుడు తప్పిపోయాడు. వివరాలు ఇలా.. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామ పంచాయతీ పులిగుట్ట తండాకు చెందిన రతన్ మొదటి భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. అతడి రెండో భార్య కాజల్ ఆమె కుమారుడితో పాటు మొదటి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి నాలుగు రోజుల క్రితం తిరుపతి దర్శనానికి వెళ్లారు. తిరుపతిలో రతన్ మొదటి భార్య కుమారుడు నేరు (6) తప్పిపోయాడు. శుక్రవారం సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్న రతన్ తన కుమారుడు తిరుపతిలో తప్పిపోయినట్లు హంగామా చేసినట్లు తండా వాసులు పేర్కొన్నారు. తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాబు ఆచూకీ దొరుకుతుందని స్టేషన్‌లోని రైల్వే పోలీసులు రతన్‌కు సూచించినట్లు సమాచారం. కాగా దర్శనానికి వెళ్లిన కుటుంబంలోని బాలుడు మాత్రమే తప్పిపోవడంపై తండా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండా నాయకులు మనోహర్‌తో పాటు యువకులు బాలుడి ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రయత్నాలు ప్రారంభించారు.
తల్లి, కూతురు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: వివాహిత తన కూతురుతో కలిసి అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరులో ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 10న రాత్రి సంసారం విషయంలో భార్య (31)తో గొడవపడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం భార్య, మూడేళ్ల కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. భార్య, కూతురు అదృశ్యంపై భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


