● చేపలు పడితే జరిమానా
● కుల సంఘం పెద్దల హుకుం
చిన్నకోడూరు(సిద్దిపేట): చేపలు పట్టే హక్కుపై కట్టుబాట్లు కట్టడి చేస్తున్నాయి. ఇటీవల రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో చేపలు పట్టడానికి ఒక కుల సంఘం పెద్దలు నిషేధం విధించారు. నిబంధనలు తెలియని నలుగురు యువకులు శుక్రవారం సాగర్‌లో చేపలు పట్టడానికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన కుల సంఘం పెద్దలు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 40 వేలు జరిమానా విధించారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో చేపల వేట విషయంలో మత్స్యకారులు, ముదిరాజ్‌ల మధ్య వివాదం జరుగుతోంది. చేపలు పట్టే హక్కు తమదేనని మత్స్యకారులు, ముదిరాజ్‌లు వాదిస్తున్నారు. సంబంధిత అధికారులు ఎటూ తేల్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో కుల సంఘాల పెద్దలు రంగనాయక సాగర్‌లో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తే జరిమానాలు విధిస్తామంటూ తీర్మానాలు చేశారు.
రూ.లక్ష జరిమానా..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండల పరిధిలోని చంద్లాపూర్ వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు. రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపుతున్నారు. అలాగే ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందులో ఉచితంగా చేప పిల్లలను వదులుతోంది. చేపలు పట్టే హక్కు కోసం చిన్నకోడూరు, పెద్దకోడూరు, చంద్లాపూర్, రామంచ, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులు, ముదిరాజ్‌లు లైసెన్స్ కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు హక్కులు ఎవ్వరికీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కుల సంఘాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సాగర్‌లో ఎవ్వరు చేపలు పట్టినా వారికి రూ.లక్ష జరిమానా విధిస్తామని హుకుం జూరీ చేశారు. విషయం తెలియక చంద్లాపూర్‌కు చెందిన నలుగురు యువకులు సాగర్‌లో చేపలు పట్టేందుకు దిగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక కుల సంఘం పెద్దలు వారిని అడ్డుకుని ఒక్కో యువకునికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు సమాచారం.
రంగనాయక సాగర్


