ఇంటి మంజూరు పేరిట బేరాలు నిరుపేదల నుంచి రూ. వేలల్లో డిమాండ్
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లికి చెందిన ఓ వృద్ధ మహిళకు మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. పైసా పైసా కూడబెట్టి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. బేస్‌మెట్ పూర్తి కావడంతో మొదటి బిల్లు ఖాతాలో జమ అయింది. బిల్లు పడిన విషయం తెలుసుకున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహిళను సంప్రదించారు. ఇల్లు మంజూరు, బిల్లు వచ్చినందుకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని, రూ.2 వేలు ఇస్తానని ఇవ్వగా తీసుకున్నారు. ఇలా గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటున్న ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు గుంజుతున్నారు. రూ. వేలల్లో వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 10,898 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10,120 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,068 ఇళ్లు పూర్తయ్యాయి. ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయానికి తోడు కొంత డబ్బు జమ చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల నిర్వాకంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. రాజకీయ పలుకుబడి లేని నిరుపేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని డబ్బులిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేపిస్తామని కమిటీ సభ్యులు రూ.వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ఏకంగా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న ఇంటి అప్‌డేట్‌ను హౌసింగ్ ఏఈలు యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి వెళ్తే తమకు చెప్పకుండా యాప్‌లో ఎలా అప్‌లోడ్ చేస్తారని, తమ అనుమతి లేకుండా ఊరిలోకి రావొద్దని ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులను బెదిరిస్తున్న ఘటనలూ ఉన్నాయి.
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు
నిర్మాణం పూర్తి చేసుకుని..
సిద్దిపేట జిల్లాలో కమిటీ సభ్యుల వసూళ్ల పర్వం
నిబంధనలు గాలికి...
ఇందిరమ్మ కమిటీ సభ్యులు డబ్బులు తీసుకుంటూ అనర్హులకు ఇల్లు మంజూరు చేపిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారు, ఫోర్ వీలర్ ఉన్న వారు, ఇన్‌కం ట్యాక్స్ కట్టే వారు అనర్హులు. కానీ అన్నీ ఉన్న వారిని సైతం అర్హులుగా గుర్తిస్తుండటం గమనార్హం.
ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు
ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇందు కోసం ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. డబ్బులు ఇస్తేనే ఇల్లు మంజూరు అవుతుందనేది తప్పు. మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాస్, హౌసింగ్ పీడీ


