● నకిలీ ఓటర్లను తొలగించేందుకే ఎస్‌ఐఆర్ ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
కొండపాక(గజ్వేల్): నకిలీ ఓటర్లను తొలగించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై అధికార, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడమేకాక, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుండటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మాత్‌పల్లి శివారులో గల ఓ రిసార్టులో జరుగుతున్న పండిట్ దీన్‌దయాళ్ శిక్షణ తరగతులకు గురువారం ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా చనిపోయిన వారి పేర్లు, నకిలీ ఓటర్లు, ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ చేపడుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా చూస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఎస్‌ఐఆర్ ఉద్దేశ్యాన్ని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యవహరించడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా 1952 నుంచి 2026 వరకు సుమారు పదిమార్లు ఓటరు జాబితా సవరణలు జరిగాయన్న విషయాన్ని మర్చిపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ పట్టణంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు ఓటర్లుగా నమోదు అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే భారత పౌరుల ఓటు హక్కుకు భంగం రాకుండా చూసేలా ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా సవరణ చేపట్టిందన్నారు. పచ్చిమ బెంగాల్, కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం ఇదే రకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తారన్న విషయాన్ని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలన్నారు. జమిలీ ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరీని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో అన్నీ అప్పులే..
పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఏ ఒక్క శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, రైతులకు భరోసా లేకుండా అప్పుల భారాన్ని మిగిల్చిందని ఆరోపించారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అర్హుడైన ప్రతీ ఓటరుకు ఓటు హక్కు ఉండేలా ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేష్‌గౌడ్,నాయకులు విభీషణ్‌రెడ్డి, విద్యాసాగర్, లక్ష్మణ్, కృష్ణమూర్తి, ఐలయ్య, మనోహర్, వెంకట్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.


