ప్రయాణంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే.. | - | Sakshi
Sakshi News home page

ప్రయాణంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే..

Mar 28 2026 10:37 AM | Updated on Mar 28 2026 10:37 AM

మెదక్‌జోన్‌: ఈ రెండు ప్రమాదాల్లోనూ వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోవడంతోనే తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా జరుగుతున్న ప్రమాదాల తీరును గమనించిన పోలీసులు ఓవైపు నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎంత మొత్తుకుంటున్నా వాహనదారుల చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాల పాలిట యమపాశంగా మారుతోంది. దీంతో ప్రమాదాలు జరిగినా ప్రాణం పోకూడదనే లక్ష్యంతో జనవరి నుంచి ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 6 నుంచి జూన్‌ 12 వరకు కొనసాగే ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్‌ 13 నుంచి 18 వరకు ఆరురోజుల పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై ‘అరైవ్‌–అలైవ్‌’కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్‌, రవాణశాఖ అధికారులకు షెడ్యూల్‌ను ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో 31 బ్లాక్‌స్పాట్లు గుర్తింపు

జిల్లా మీదుగా వెళ్లే నాలుగు జాతీయ రహదారుల్లో 31 చోట్ల ట్రాఫిక్‌ పోలీసులు బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. అందులో ఎన్‌హెచ్‌ 44పై 16 చోట్ల, ఎన్‌హెచ్‌ 161పై 3 చోట్ల, ఎన్‌్‌హెచ్‌ 161 ఏఏపై రెండుచోట్ల, ఎన్‌హెచ్‌ 765డీపై 10 చోట్ల మొత్తం 31 ప్రమాద స్థలాలను గుర్తించారు. ఆ ప్రదేశాల్లో ప్రమాదాల నివారణ కోసం రేడియం స్టిక్కర్లు వేయటం, లైటింగ్‌ ఏర్పాటు, రోడ్డు కనిపించకుండా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించటంతోపాటు ఆ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పోలీస్‌, ఎన్‌హెచ్‌శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు.

డ్రైవర్లకు నేత్ర పరీక్షలు..కళ్లద్దాల పంపిణీ

భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ఇతర గూడ్స్‌ వాహనాలు నడిపే 491 మంది డ్రైవర్లకు పోలీసులు కంటిపరీక్షలు నిర్వహించారు. వారిలో 193 మందికి కంటి సమస్య ఉన్నట్లు గుర్తించి చికిత్సలు చేయించారు. మరో 73 మందికి కళ్లజోళ్లను అందించారు.

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ.. విస్తృత అవగాహన కల్పిస్తున్న పోలీస్‌శాఖ

ఫిబ్రవరిలో మెదక్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌ నుంచి తన స్నేహితుడితో కలిసి కారులో మెదక్‌ వస్తుండగా రాంపూర్‌ శివారులో చెట్టును ఢీకొట్టడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతను సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్‌ ఓపెన్‌అయి బతికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ నెల 14న హవేళిఘనాపూర్‌ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓ తండ్రి, అతడి కొడుకు, అల్లుడు ఒకే ద్విచక్రవాహనంపై మెదక్‌–నర్సాపూర్‌ జాతీయరహదారిపై ప్రయాణిస్తూ కొల్చారం మండలం రాంపూర్‌ శివారులో ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ హెల్మెట్‌ ధరించి ఉన్నా ప్రాణాలతో బయటపడేవారు.

రూల్స్‌ పాటించకే ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాల్లో 95% ట్రాఫిక్‌ నిబంధనలు పాటించక పోవటం వల్లే జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవాలి. ఇప్పటికే పలుదఫాలుగా అవగాహన కల్పించాం. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్‌ 13 నుంచి 18 వరకు మరో 6 రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం.

శ్రీనివాస్‌రావు, ఎస్పీ మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement