● కమిటీ సభ్యుల స్పష్టీకరణ
● లీజుకు ఇచ్చే ప్రయత్నాలకు అభ్యంతరం
జహీరాబాద్: మున్సిపల్ పరిధిలోని అల్లీపూర్‌లో గల మెథడిస్ట్ చర్చి ఆస్తులను పరిరక్షించుకుంటామని బీజీ గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చి సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. శుక్రవారం చర్చి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మిషనరీ ప్రతినిధుల జోక్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మెథడిస్ట్ చర్చి కింద 65 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని లీజు పేరిట అక్రమాలకు చోటు కల్పించేందుకు మిషనరీ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లీజుకు సమ్మతించబోమన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పేదరికంతో అనేక మంది విద్యకు దూరం అవుతున్నందున బీజీ గార్డెన్‌దొర 1931లో పాఠశాలను ప్రారంభించారన్నారు. ఎందరో విద్యనభ్యసించి ఉన్నత స్థితికి చేరారని గుర్తు చేశారు. విదేశీ నిధులతో విద్యాసంస్థను నిర్వహించారన్నారు. అంతే కాకుండా ఆస్తులను సైతం సమకూర్చారన్నారు. మిషనరీ ప్రతినిధులు దీన్ని మిషనరీల కిందకు చేర్చి ఆస్తులను 60 నుంచి 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే స్థానిక కమిటీ సభ్యులు అడ్డుకోడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో లీజు పేరిట ఆస్తులన్నీ కరిగిపోయినట్లు గుర్తు చేశారు. ఇక నుంచి కూడా చర్చి వ్యవహారంలో మిషనరీ ప్రతినిధులు జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. అన్ని కార్యకలాపాలు, వ్యవహారాలన్నింటిని స్థానిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలోనే సాగుతాయన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు టి.వినయ్‌కుమార్, ఎన్.మోసెస్, ఎం.శాంతికుమార్, ఎ.సత్యానందం, బి.దేవిదాస్, ఇజ్రాయిల్ బాబీ, ఎన్.జనార్దన్, జోసెఫ్ స్టార్లిన్, జేమ్స్, ఉల్లాస్, జగన్నాథ్, ప్రమోద్ పాల్గొన్నారు.


