● 25 ఖరీదైన ఫోన్లు స్వాధీనం
అనంతగిరి: జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లలో ఖరీదైన సెల్ ఫోన్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ చోరీ కేసులు ఎక్కువ కావడంతో ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాలతో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వికారాబాద్, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సెల్ ఫోన్ దొంగతనం కేసులపై దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించారు. చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడు కే.రవి అలియాస్ గౌరి(డోన్ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్)ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రవితోపాటు ఐదుగురు పెద్దరు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలతో దొంగతనాలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఆటోలు, బైక్‌లపై తిరుగుతూ, రద్దీ మార్కెట్లలో ఖరీదైన సెల్ ఫోన్లను మైనర్లతో దొంగతనం చేయించేవారు. చోరీలకు పాల్పడుతున్న కే.రవితోపాటు బి.మహేష్, వడ్డె మురళి, వడ్డె వెంకటేష్ (మహబూబ్ నగర్ జిల్లా), ఆకుల కార్తీక్, సంపంగి తిరుపతి(హైదరాబాద్)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్ మాట్లాడుతూ.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ టీం, వికారాబాద్ పోలీసులను అభినందించారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ టౌ న్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, సీసీఎస్ ఎస్‌ఐ రమేష్, సిబ్బంది రాజు, రామకృష్ణ, రవీందర్, రమేష్, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


