వెల్దుర్తి(తూప్రాన్): నిశ్చితార్థం జరిగినా పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఏదులపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి సుగుణ, శ్రీహరి దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌కు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబసభ్యులు కలిసి ఏప్రిల్ 10న పెళ్లి నిర్ణయించి లగ్నపత్రికలు రాసుకున్నారు. కాగా కొద్దిరోజుల నుంచి అమ్మాయి ఫోన్ తీయకపోవడంతో రెండు రోజుల క్రితం ఆమె పనిచేస్తున్న మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో గురువారం ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. అమ్మాయి కుటుంబీకులు పెళ్లికి నిరాకరించి రద్దు చేశారు. దీంతో కలత చెందిన విజయ్‌కుమార్ గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. పెళ్లీడుకొచ్చిన కొడుకు జీవచ్ఛంలా మారడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మద్యం మత్తులో పెట్రోల్ తాగి..
దుబ్బాక: మద్యం మత్తులో పెట్రోల్ తాగి యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.దుబ్బాక మండలం పెద్దచీకోడ్‌కు చెందిన ఎండీ.ఫయాజ్(22) అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16న మద్యం మత్తులో తన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి బాబాయ్ ఫరూక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


