అక్రమ మైనింగ్‌పై రైతుల ఫిర్యాదు
భూగర్భ గనులశాఖ తీరుపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మా గ్రామంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది.. అనుమతులు లేకుండానే విలువైన ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా రవాణా చేస్తున్నారు.. అడ్డగోలు తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతల్లో పడి పశువులు చనిపోతున్నాయి. ఈ అక్రమ మైనింగ్ వల్ల వ్యవసాయం చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది.. ఇకనైనా ఈ సహజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేయండి. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి..’’ అంటూ అందోల్ నియోజకవర్గంలోని ముదిమాణిక్యం గ్రామ రైతులు భూగర్భ గనులశాఖ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాన్ని అందించారు.
ఫిర్యాదు అందిన వెంటనే భూగర్భ గనుల శాఖ అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికే అక్రమంగా తవ్వి తరలించిన ఖనిజ సంపద ఎంత లూటీ అయిందో తేల్చాలి. లూటీ చేసిన ఖనిజానికి సంబందించిన సీనరేజీ /రాయల్టీలను, వాటిపై జరిమానాలు విధించాలి. దాన్ని వసూలు చేసి సర్కారు ఖజానాకు జమ చేయించేలా చర్యలు చేపట్టాలి. కానీ గనులశాఖ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పలు ఆరోపణలకు దారితీస్తోంది.
రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి..
ఈ అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సదరు రైతులు హైదరాబాద్‌లోని ఆశాఖ రాష్ట్ర డైరెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే ఓ మంత్రి దృష్టికి కూడా ఈ అక్రమ మైనింగ్‌పై వినతిపత్రం అందజేశారు. దీంతో ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా గనులశాఖ అధికారులు అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వచ్చారు. ఫిర్యాదు చేసిన రైతులతో చర్చించుకుని సమస్యను మీరే పరిష్కరించుకోవాలని అక్రమ మైనింగ్‌కు పాల్పడిన అక్రమార్కులకు ఈ శాఖ అధికారులు ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ శాఖ అధికారుల సలహాతో రంగంలోకి దిగిన అక్రమ మైనింగ్ వ్యాపారులు ఫిర్యాదు చేసిన రైతులతో బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
సర్వే పేరుతో సాగదీత
అక్రమ మైనింగ్ ఎంత జరిగిందో తెలియాలంటే క్షేత్ర స్థాయి సర్వే చేయాల్సి ఉంటుందని ఆశాఖ అధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ సర్వే చేసేందుకు ప్రస్తుతం తమ వద్ద సిబ్బంది లేరని ఆశాఖ అధికారులు చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయమై ‘సాక్షి’ భూగర్భ గనులశాఖ అధికారులకు వివరణ కోరగా.. బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించామన్నారు. అక్రమ మైనింగ్ ఎంత జరిగిందో తేల్చేందుకు సర్వే చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతానికి సర్వేయర్ లేని కారణంగా ఈ ప్రక్రియ చేపట్టలేకపోయామని చెప్పారు.
ఎంత లూటీ చేశారో తేల్చకుండా సర్వే పేరుతో సాగదీత
తక్షణం చర్యలు తీసుకోవాల్సింది పోయి దాటవేత ధోరణి
గనులశాఖ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
ఆ శాఖ రాష్ట్ర డైరెక్టరేట్‌ను ఆశ్రయించిన బాధిత రైతులు
జిల్లాలో భూగర్భ గనులశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల విచ్చల విడిగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ., ఆశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పటాన్‌చెరు, కంది, సంగారెడ్డి, జిన్నారం తదితర మండలాల్లో కంకర క్వారీల్లో రూ.వందల కోట్ల మైనింగ్ కుంభకోణం వెలుగు చూసిన విషయం విదితమే. ఈశాఖ అధికారులు ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వదిలేయడంతో ఇలా రూ.వందల కోట్ల ఖనిజ సంపద లూటీ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఈ అక్రమ మైనింగ్ ఫిర్యాదులపై దాటవేత ధోరణిని అవలంబిస్తుండటంతో జిల్లాలో ఖనిజ సంపద దోపిడీ యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ మైనింగ్‌పై రైతుల ఫిర్యాదు


