సర్పంచ్ వేతనం రూ.6,500!
● ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు
● అయినా.. పోటీపై ఆసక్తి
జోగిపేట(అందోల్): సర్పంచ్‌గా పోటీ చేసేందుకు పెద్దసంఖ్యలో ఆశావహులు ఉత్సాహపడుతుంటారు. ఈ పదవిని పొందేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఉత్సాహం, గెలిచేందుకు చేస్తున్న ఖర్చును చూసి ప్రజలు సర్పంచ్‌కు ఎంత వేతనం వస్తుంది? ఆ పదవికి ఎంత ఆదాయం ఉంటుంది? ఎందుకు అంతగా ఖర్చు చేస్తున్నారని అనుకోవడం సహజమే. కాగా, రూ.లక్షల్లో ఖర్చు చేసి ఒక్కొక్కరిని బతిమిలాడి, సర్పంచ్‌గా గెలిస్తే వారికి నెలకు వచ్చే వేతనం ఎంతో తెలుసా..? కేవలం రూ.6,500 మాత్రమే. ఈ వేతనం కూడా ప్రతినెలా అందే అవకాశం ఉండదు. ఎప్పుడో ప్రభుత్వం గ్రాంటు విడుదలైన సమయంలోనే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే తొలుత సర్పంచ్‌లకు వేతనాలు ఉండేవి లేవు. 1992 నుంచే చిన్న గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు రూ.600, మేజర్ గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు రూ.1000 మాత్రమే గౌరవ వేతంగా ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 ఏప్రిల్ 1 నుంచి సర్పంచ్‌ల వేతనం రూ.5 వేలకు పెంచారు. ఆ తర్వాత 2021లో రూ.6,500లకు పెంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా 2018 తర్వాత నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వ బిల్లులు చెల్లించడంలేదు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయం లభించక అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.


