అత్యవసర సహాయక చర్యలకు కమిటీలు
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలలో అనుకోని సంఘటనలు జరిగితే అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం టీజీఐసీసీసీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్‌తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈనెల 22న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న టేబుల్ టాప్ (మాక్) ఎక్సర్ సైజ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక వాడలలో ప్రమాదాలు, వరదలు విపత్తులు జరిగిన సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జాతీయ విపత్తు నివారణ సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సహకారంతో మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలు, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ రకాల పరిశ్రమలలో వాటి స్థాయిలకు అనుగుణంగా అవసరమైన అన్ని రకా ల భద్రతా ప్రమాణాల చర్యలను బృందాలతో నిరంతరం తనిఖీ చేయనున్నట్లు వివరించారు. అన్ని శాఖల అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


