ఆశలన్నీ ఆలుపైనే
జహీరాబాద్‌లో విస్తారంగా సాగైన పంట
పంట చేతికి అందివచ్చాక విక్రయం నిమిత్తం మార్కెట్‌కు తరలించుకుంటే అక్కడ గిట్టుబాటు ధర లభిస్తేనే లాభదాయంగా ఉంటుందని రైతులు అంటున్నారు. మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.1,800 నుంచి రూ.2వేలు లభిస్తేనే ఆలుగడ్డ పంట లాభదాయకంగా ఉంటుందంటున్నారు. ఇంత మేర ధర లభించినా పంట దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండాలంటున్నారు. ఎకరానికి 120 నుంచి 150 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చినప్పుడే గిట్టుబాటవుతుందంటున్నారు. 80 క్వింటాళ్లకు దిగుబడులు పడిపోతే పెట్టుబడులకే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్: వానాకాలం పంటలు దెబ్బతినడంతో రైతుల అశలన్నీ ఆలుగడ్డ పంటపైనే పెట్టుకున్నారు. ఈ ఏడాది జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ పంట విస్తారంగా సాగైంది. సుమారు 3వేల ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్లు అంచనా. జిల్లాలోనే 90 శాతం మేర జహీరాబాద్ ప్రాంతంలోనే పంట సాగవుతోంది. ప్రతి ఏటా ఇంత మేర విస్తీర్ణంలో ఆలుగడ్డ సాగవుతూ వస్తోంది. ప్రధానంగా కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో రైతులు పంటను సాగు చేసుకున్నారు. వానాకాలంలో మినుము, పెసర, కంది, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. అధిక వర్షాల వల్ల పంటలు చేతికందకుండా పోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల పాలయ్యారు. ఆయా పంటలు దెబ్బతినడంతో నీటి వసతి ఉన్న రైతులు ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్నారు. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెగుళ్లు సోకకుండా రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు.
భారీగా పెట్టుబడులు
ఆలుగడ్డ పంట సాగు కోసం రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎకరా పంట సాగుపై రూ. 50వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎకరా భూమిలో సాగు కోసం అవసరం అయిన విత్తనానికే రూ.30వేలు పెట్టుబడి అయిందని రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికి అందివచ్చే వరకు ఎకరాకు రూ.60వేల వరకు పెట్టుబడులు అవుతాయంటున్నారు. ఎరువులు, రసాయన మందుల పిచికారికి, అంతరకృషి తదితర వాటికి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఇంత మేర పెట్టుబడులు పెట్టినందున ఎకరాపై కనీసం రూ. లక్ష మేర చేతికి అందితేనే గిట్టుబాటవుతుందని, లేనట్లయితే పెట్టుబడులకే సరిపోతుందన్నారు.
పక్షం రోజుల్లో పంట చేతికి
మరో పక్షం రోజుల్లో ఆలుగడ్డ పంట చేతికి అందనుంది. ఎర్ర నేలల్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, నల్లరేగడి నేలల్లో నవంబర్ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు అంచెలంచెలుగా రైతులు ఆలుగడ్డ పంటను సాగు చేశారు. పెస్టెంబర్‌లో సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికి అందివచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉండడంతో రైతులు ఆలుగడ్డ పంటపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ధర నిలకడగా ఉంటుందా లేక పంట దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తితే ధరలు పతనం అవుతాయా అనే సందేహం కూడ రైతులను వెంటాడుతోంది.
వానాకాలం పంటలు దెబ్బతినడంతో ఆలుగడ్డవైపు మొగ్గు
గిట్టుబాటు ధర లభిస్తేనే గట్టెక్కుతామంటున్న రైతులు
పక్షం రోజుల్లో మార్కెట్‌లోకి కొత్త పంట


