ఆస్పత్రులకు నిధులలేమి?
రెండేళ్లుగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎఫ్)లను ఏర్పాటు చేయకపోవడంతో సర్కారు దవాఖానలకు నిధుల మంజూరు ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
– రామాయంపేట(మెదక్):
జిల్లా పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు కమ్యూనిటీ, ప్రధాన, ప్రాంతీయ ఆస్పత్రులకు గతంలో అభివృద్ధి కమిటీలుండేవి. జిల్లా ఆస్పత్రికి జడ్పీ చైర్మన్, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న వాటికి ఎమ్మెల్యేలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎంపీపీలు చైర్మన్లుగా వ్యవహరించేవారు. వారితోపాటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, తహసీల్దార్, అధికారులు, ఆయా పార్టీల ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి. కమిటీ సమావేశాల్లో చర్చించి ఆయా ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేవారు. అలాగే మౌలిక సదుపాయాలు, మందులు కొనుగోలు, తాగునీటి ఎద్దడి , భవనానికి మరమ్మతులు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి నిధులు వినియోగించేవారు. కానీ రెండేళ్లుగా కమిటీల నియామకం ఆగిపోయింది. దీంతో ఆస్పత్రులకు మంజూరు కావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా సమస్యలు తిష్టవేశాయి.
తిష్ట వేసిన సమస్యలు
రామాయంపేట కమ్యూనిటీ ఆస్పత్రిలో పాత భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ భవనంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. భవనం మరమ్మతులకు నిధుల మంజూరు అత్యవసరం.
టేక్మాల్ పీహెచ్‌సీలో చాలా సమస్యలు పేరుకుపోయాయి. షార్ట్ సర్క్యూట్‌తో ఆస్పత్రిలో విద్యుత్ వైర్లు, కంప్యూటర్లు కాలిపోయాయి. రాత్రి అంధకారంలో ఉంటుంది. అలాగే పైపులైన్ బ్లాక్ అవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. అత్యవసర పనులకు రూ. 15 లక్షలు ఖర్చవుతుందని ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
ప్రగతి ధర్మారం పీహెచ్‌సీలో భవనం స్లాబ్ కింది భాగం పాక్షికంగా దెబ్బతిని తరచూ సిమెంటు పెచ్చులు ఊడి పడుతున్నాయి. వర్షం పడితే స్లాబ్ నుంచి నీరు కారుతుంది.
నార్సింగి పీహెచ్‌సీ పరిధిలో ప్రధానంగా కోతుల సమస్య ఉంది. భవనం రూఫ్ పాక్షికంగా దెబ్బతిన్నది.
రేగోడ్ పీహెచ్‌సీ పరిధిలో భవనానికి మరమ్మతులు అవసరం. ఇక్కడ పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు ప్రభుత్వం నుంచి మంజూరు కాకపోవడంతో డాక్టర్, సిబ్బంది కొంత జమచేసి ఇస్తున్నారు.
సర్దెన పీహెచ్‌సీలో కంప్యూటర్లు, ఫర్నీచర్ కావాలి. అలాగే ప్రింటర్‌కు, భవనానికి మరమ్మతులు చేయాలి.
చేగుంట పీహెచ్‌సీలో సిబ్బందికి వైద్యుడు సొంతంగా జీతాలు ఇస్తున్నారు. విద్యుత్ మరమ్మతులు చేయించినా నిధులు మంజూరు కాలేదు.
జిల్లాలోని ఆస్పత్రుల వివరాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 21
సామాజిక ఆస్పత్రులు 3
బస్తీ దవాఖానలు 2
ప్రాంతీయ ఆస్పత్రి 1
ఉప కేంద్రాలు 59
పల్లె దవాఖానలు 98
రెండేళ్లుగా ఏర్పాటు కాని అభివృద్ధి కమిటీలు
నిలిచిపోయిన ఫండ్స్
పరిష్కారానికి నోచుకోని సమస్యలు
ఇబ్బందులు పడుతున్న రోగులు
ఆస్పత్రులకు నిధులలేమి?


