పేదల పథకానికి ఆదరణేది?
కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే.. బాధిత కుటుంబానికి రూ.20వేల అందించి ఆదుకునే కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎఫ్‌బీఎస్(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్) పథకం స్ఫూర్తి దెబ్బతింటోంది. అవగాహన లేమితో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి బాధితులు ముందుకు రావడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సారి 106 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో కొద్దిమందికి మాత్రమే సాయం అందటంతో చర్చనీయాంశంగామారుతోంది. – గజ్వేల్:
ఉమ్మడి మెదక్ జిల్లా(సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్)లో కీలకమైన పథకాల అమలులో నిర్లక్ష్యం అలుముకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రత్యేకించి పేదలకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్‌ఎఫ్‌బీఎస్(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్)ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి చనిపోతే.. బాధిత కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నదే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద రూ.20వేల సాయం అందనుంది. దీనిపై క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా బాధితులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం లేదు. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలందరూ ఈ పథకానికి అర్హులే. మరణించిన కుటుంబ యజయాని వయసు 18నుంచి 60 ఏళ్లలోపు ఉంటే...ఆధార్, రేషన్ కార్డు, మరణ, కుల ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా వివరాల పత్రాలను దరఖాస్తుతోపాటు తహసీల్దార్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును ఐకేపీ, రెవెన్యూ సిబ్బంది విచారించిన అనంతరం ఆర్‌డీఓకు పంపుతారు. ఆర్‌డీఓ సెర్ప్ సీఈఓకు సిఫార్సు చేస్తే సాయం మంజూరవుతోంది. ఏటా ఒక్కో జిల్లాకు వెయ్యికి పైగా దరఖాస్తులకు సాయం అందించే అవకాశమున్నా అర్జీలు రాక, ఈ పథకం స్ఫూర్తి దెబ్బతింటోంది.
ఈ ఏడాది
106 దరఖాస్తులే..
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 87 దరఖాస్తులు రాగా, ఇందులో 39మందికి సాయం అందింది. మిగితా దరఖాస్తులను విచారణ పేరిట పెండింగ్‌లో పెట్టారు. ఇందులో చాలావరకు తిరస్కరించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 11 దరఖాస్తులు అందాయి. మెదక్ జిల్లాలో కేవలం 8 దరఖాస్తులు అందగా, ఇందులో ఒక దరఖాస్తును తిరస్కరించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ పథకం అమలులో ఉమ్మడి మెదక్ జిల్లా వెనుకంజలో ఉంది. ఈ ఏడాది 11,869 దరఖాస్తులతో నల్గొండ మొదటి స్థానం, 1643 దరఖాస్తులతో యాదాద్రి భువనగిరి రెండోస్థానంలో ఉండగా ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ కలుపుకొని 106 దరఖాస్తులే రావడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
ఎన్‌ఎఫ్‌బీఎస్‌పై కొరవడిన అవగాహన
దరఖాస్తుకు ముందుకురాని బాధితులు
ఉమ్మడి జిల్లాలో 106 అర్జీలు
అవగాహన కల్పించని అధికారులు
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
అధికారుల నిర్లక్ష్యం వల్లే కొన్నేళ్లుగా ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం అమలులో నిర్లక్ష్యం అలుముకున్నది. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నాం.
– పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి
పేదల పథకానికి ఆదరణేది?


