అనుమతిలేని వెంచర్లు | - | Sakshi
Sakshi News home page

అనుమతిలేని వెంచర్లు

Oct 31 2025 11:43 AM | Updated on Oct 31 2025 11:43 AM

అనుమతిలేని వెంచర్లు

అనుమతిలేని వెంచర్లు

అందినకాడికి దండుకోవడమే నిమ్జ్‌ ప్రాజెక్టు ఆశజూపి.. కొనేముందు ప్లాట్లను చూసుకోవాలి

వందకు పైగా పర్మిషన్లు లేనివే

వరద ప్రవాహం.. ఆందోళన చెందుతున్న ప్లాట్ల కొనుగోలుదారులు

జహీరాబాద్‌

జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్‌) ప్రాజెక్టు ఆశ చూపుతూ జహీరాబాద్‌లో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇండ్ల నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేకున్నా రియల్‌ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి అమ్మకాలకు పెడుతున్నారు. నల్లరేగడి నేలల్లో సైతం పెద్ద సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అమ్మకాలకు పెట్ట డంతో కొందరు సైట్‌ చూడకుండానే కొనుగోలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు. జహీరాబాద్‌ దాని చుట్టుపక్కలా వేలాది ఎకరాల్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నాయి. ఇప్పటివరకు అనుమతులు పొందిన వెంచర్లు 42 మాత్రమే ఉండగా 100కు పైగా అనుమతులు లేని వెంచర్లే ఉన్నాయి. అయినా రియల్టర్లు వాటిలో ప్లాట్లను అమ్మకాలకు పెడుతున్నారు.

పట్టణం చుట్టుపక్కల ఉన్న అల్లీపూర్‌, పస్తాపూర్‌, చిన్న హైదరాబాద్‌, రంజోల్‌, హోతి(కె) గ్రామాలను జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో విలీనం చేశారు. ఆయా గ్రామాల్లో గతంలో గ్రామ పంచాయతీలో నామమాత్రపు అనుమతులు పొందారు. ఇప్పుడు వెంచర్లను ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. పార్కుల స్థలాలు వదలకుండా అందినకాడికి దండుకుంటున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిస్తే ఇప్పటికే పలు వెంచర్లలోని ఇళ్లు నీట మునుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగాలేని నల్లరేగడి భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి, వాటిలో అక్రమంగా వేలాది టిప్పర్ల ఎర్రమట్టిని పోసి కొనుగోలుదారులకు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.

జహీరాబాద్‌ సమీపంలో 12వేల ఎకరాల్లో నిమ్జ్‌ ప్రాజెక్టు వస్తుండటంతో ఈ ప్రాంతం భారీస్థాయిలో అభివృద్ధి చెందనుందనే ఆశతో ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి బలహీనత, ఆశలను ఆసరాగా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. రియల్టర్లు సొమ్ము చేసుకునేందుకు అనువుగాలేని భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. వెంచర్లలో నుంచి వెళ్లే వరద కాలువలను సైతం దారి మళ్లిస్తున్నా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోకుండా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు వెంచర్లలో వాగులను దారి మళ్లించారు. అనుమ తుల్లేని వెంచర్లలో క్రయ విక్రయాలను నిలిపివేసి అమాయకులు నష్టపోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజలు గుడ్డిగా వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసుకోకూడదు. ఇండ్ల నిర్మాణానికి అనువుగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేసుకోవాలి. అనుమతులు లేని వెంచర్లలో అమ్మకాలు జరిపితే చట్టపరంగా చర్యలు చేపడతాం.

–సుభాష్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌

నిర్మాణాలకు అనుకూలంగా లేకున్నా ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement