 
															రహదారులు ధ్వంసం
గుంతలమయంగా రోడ్లు 
● అవస్థలు పడుతున్న ప్రజలు 
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండల పరిధిలోని పలు రోడ్లు వర్షాలకు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు గుంతలు పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగ్గుతోంది. గుంతల వల్ల బైక్‌లు అదుపు తప్పి పడిపోతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకోవడంతో వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు.
మరమ్మతులు కూడా లేవు
జహీరాబాద్–అల్లాన రోడ్డు గుంతలమయంగా తయారైంది. బైపాస్ రోడ్డు నుంచి అల్లనా మీదుగా దిడ్గి చౌరస్తా వరకు రోడ్డుపై ఎక్కడ చూసిన పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వాహనాల రద్దీ ఉండే రోడ్డుపై వెళ్తుంటే సర్కస్ ఫీట్లు చేసినట్లుగా ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డుపై పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌లు అదుపుతప్పి పడిపోతున్నాయి. మండలంలోని బూచినెల్లి రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు గల సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ప్రజలు నరకం చూస్తున్నారు. ఇటీవల గ్రామస్థులు ముందుకు వచ్చి బురదమయంగా తయారైన రోడ్డుపై సొంత డబ్బులతో కంకరు వేసి గోతులను పూడ్చిపెట్టారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరినా పట్టించుకునే వారు కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్–శేఖాపూర్ రోడ్డు కూడా దెబ్బతిని గుంతలు పడ్డాయి. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో పడిన గుంతల కారణంగా దగ్గరకు వచ్చే వరకు వాహనదారులు గమనించడంలేదు. అధికారులు స్పందించి దెబ్బతిని అధ్వాన్నంగా మారిన రోడ్లను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
