ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ
ఇటీవల కొత్తగా ఏర్పాటు అయిన జిన్నారం మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. గ్రామ పంచాయతీగా ఉన్న మండలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చడంతో సమస్యలు మాత్రం తీరలేదు. పైగా ఆదాయ, వ్యయాలు పక్కన పెడితే సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిన్నారం (పటాన్‌చెరు): కాంగ్రెస్ ప్రభుత్వం జిన్నారం మండలాన్ని ఇటీవల మున్సిపాలిటీగా మార్చింది. పట్టణీకరణ వృద్ధి చెందకుండా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంపై నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. మున్సిపాలిటీగా మారిన తర్వాత నిధుల కొరత ఏర్పడింది. దీంతో సిబ్బంది, కార్మికులకు నాలుగు నెలలుగా సమయానికి జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మున్సిపల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మున్సిపాలిటీకి ఆదాయం కూడా లేకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.
నిర్వహణ భారం
కొత్త మున్సిపాలిటీ నిర్వహణ రోజురోజుకు భారంగా మారుతుంది. దీంతో పన్నుల భారం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వద్దని చెప్పినా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఇందుకు మున్సిపాలిటీలో తలెత్తిన సమస్యలేనని చెబుతున్నారు. రాను రాను ఇంటి పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉందని భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఖర్చులు ఘనం..
జిన్నారం మున్సిపాలిటీలోని 10 గ్రామాల నుంచి ఏటా రూ.38 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. కాగా మున్సిపల్ నిర్వహణలో ఖర్చు మాత్రం కోటి వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. దీనిలో ఎక్కువ భాగం సిబ్బంది వేతనాలకు 70 లక్షలు వరకు చెల్లించాల్సి వస్తోంది. ఖర్చులు పెరుగుతూ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి లేక, పాలన భారంగా మారింది.
జిన్నారం మున్సిపాలిటీని
వెంటాడుతున్న నిధుల కొరత
వేతనాలు అందక
పారిశుద్ధ్య కార్మికుల అవస్థలు
త్వరలో అందజేస్తాం
పారిశుద్ధ్య కార్మికులకు గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి జీతాలు అందలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించిన నెల రోజుల వేతనం ఇవ్వాల్సి ఉంది. మండలం నుంచి పట్టణంగా మారడంతో కార్మికులకు నూతన బ్యాంకు ఖాతాలను ప్రారంభించి 15 రోజుల్లో జీతాలు అందజేస్తాం. త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
– తిరుపతి (జిన్నారం మున్సిపల్ కమిషనర్)
ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ


