పోలియోపై అపోహలు వద్దు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలం భీంరాలో ఆదివారం పోలియో చుక్కలు వేసిన వెంటనే శిశువు మృతి చెందడంతో సంబంధిత కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ నాగనిర్మల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సంధ్యారాణి సందర్శించారు. శిశువుకు వేసిన చుక్కల మందు సీసాను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మీడియాతో మాట్లాడుతూ.. పోలియో చుక్కల మందుపై అపోహలు వద్దని తెలిపారు. జిల్లాలో 1.86 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. భీంరాలో మృతి చెందిన శిశువుతో పాటు 108 మందికి చుక్కల మందు వేశామన్నారు. శిశువు అనారోగ్యంతోనో, లేక ఏడుస్తుండగానే పోత పాలు పట్టడంతో పాలు ఊపిరితిత్తుల్లోని వెళ్లి శ్వాస ఆడగంతోనో జరిగి ఉంటుందని అన్నారు. పోస్టుమార్టం అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగమణి ఉన్నారు.
వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలి
పోలియో చుక్కలు వేసి మా బాబు మృతికి కారణం అయిన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని శిశువు తల్లి స్వర్ణలత బంధువులు సోమవారం కంగ్టి తహసీల్దార్ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. పోస్టుమార్టం రిపోర్టు రాక ముందే డీఎంహెచ్‌ఓ తమ శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని తెలపడంతో ప్రభుత్వ వైద్య సిబ్బందిపై అనుమానం పెరిగిందన్నారు. బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలతో పాటు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
తప్పని సరిగా పోలియో చుక్కలు
జహీరాబాద్: ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందును తప్పని సరిగా వేయించాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ గాయత్రిదేవి సూచించారు. సోమవారం న్యాల్‌కల్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా చుక్కల మందు వేయించేలా చూడాలన్నారు. సమావేశంలో వైద్యులు అమృత్‌రాజ్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ నాగ నిర్మల
భీంరాలో శిశువు మృతిపై విచారణ


