విద్యార్థుల పాత్ర కీలకం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ తెలిపారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్‌నగర్ కస్తూర్బా పాఠశాలలో జరిగిన ప్రధానమంత్రి ప్రత్యక్ష కార్యక్రమంలో విద్యార్థులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు వారి మేధాశక్తితో నూతన పరికరాలను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఉస్మాన్‌నగర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థులు పబ్లిక్ టాయిలెట్ ఆటో ఫ్లష్ పరికరాన్ని తయారు చేశారన్నారు. ప్రధానమంత్రి ప్రత్యక్ష కార్యక్రమానికి కస్తూర్బా పాఠశాలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన పాఠశాల ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరెడ్డి, జిల్లా జీఈసీఓ సునీత కన్న, ఎంఈఓ పీపీ రాథోడ్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్


