కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
చెరువులోపడి వృద్ధుడు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఫరీద్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాలి లా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింతల రాజయ్య శివారులోని చెరువు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలుజారి అందులో పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు.కాగా అతడికి మతిస్థిమితం లేదని తెలిపారు.
కుళ్లిన స్థితిలో యువకుడి శవం..
నారాయణఖేడ్: కుళ్లిన స్థితిలో యువకుడి శవం చెరువులో లభ్యమైంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన సిర్గాపూర్ ఆంజనేయులు (32)వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు శివారులో గల కుబులం చెరువు వద్దకు వెళ్లగా శవమై తేలి కనిపించాడు. మృతుడి భార్య ఇతనితో దూరంగా ఉంటుందని, కొన్ని రోజులుగా మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కోహెడ(హుస్నాబాద్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన వేల్పుల సంపత్(39) చెప్పుల షాపు నిర్వహణకు, ఓ ఫైనాన్స్ ద్వారా ఆటో కొనుగోలు చేసి సుమారు రూ. 30 లక్షలు అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఈ నెల 1న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో అత్తగారి ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. కాగా మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంమ్మార్పీస్ మండలాధ్యక్షుడు మంద మల్లేశం కోరారు.
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..


