పూరి గుడిసె దగ్ధం
తూప్రాన్: ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని వెంకటరత్నాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గౌడెల్లి రాజు, రజిత దంపతులు పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆదివారం దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లారు. పిల్లలు ఇంటివద్దే ఉన్నారు. పాఠశాలకు సెలవు దినం కావడంతో పక్కింట్లో ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు గుడిసెలో నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన చుట్టు పక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలోని బియ్యం, బట్టలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం ఉన్న నివాసం కోల్పోయి రోడ్డున పడింది. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
బస్సులో నుంచి దూకిన బాలికకు గాయాలు
జోగిపేట(అందోల్): ఆధార్‌కార్డు తల్లికి ఇచ్చేందుకు ఓ బాలిక కదులుతున్న బస్సులో నుంచి కిందకి దూకింది. వివరాలు ఇలా... పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన అక్షిత తన చెల్లెలు, తల్లితో కలిసి ఆదివారం సంత కావడంతో జోగిపేటకు వచ్చారు. పప్పు దినుసులు కొనుగోలు చేసిన తర్వాత బస్టాండ్‌కు వచ్చి సంగారెడ్డి వెళ్లేందుకు అక్షిత తన సోదరితో కలిసి బస్సు ఎక్కారు. తల్లి ఆమె బంధువులతో కలిసి కలిసి తర్వాత వస్తానని చెప్పింది. ఈ క్రమకంలో తల్లి ఆధార్ కార్డు తన వద్దే ఉందని గుర్తించి వెంటనే బస్సులో నుంచి కిందకు దూకేసింది.దీంతో ఆమెకు గాయాలు కావ డంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆమె సోదరుడు తెలిపారు.కాగా అక్షిత గ్రామంలోని పాఠశాల లో తొమ్మిదో తరగతి చదువుతుంది.


