రైతన్న ఇంట సిరుల పంట
కల్హేర్(నారాయణఖేడ్): రైతన్న ఇంట సిరుల పంట పండనుంది. వర్షాకాలంలో భారీ వర్షాలతో జిల్లాలోని సింగూర్, నల్లవాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. జిల్లాలో 1,51,511 ఎకరాల్లో వరి సాగులో ఉంది. ఖేడ్ డివిజన్‌లో 42,468 ఎకరాల్లో వరి సాగులో ఉందని వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు ఆయకట్టు కింద 6 వేల ఎకరాల్లో వరి వేశారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద వరి సాగు చేయడంతో పల్లెలో ఎటుచూసినా వ్యవసాయ భూములు పచ్చదనంతో కోనసీమ అందాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం పంట చేతికొచ్చే దశలో ఉంది. రైతులు వరి కోతలు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మనూర్, నాగల్‌గిద్ద, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జిల్లాలో 37.87 లక్షల మెట్రిక్ క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, డీసీఎంఎస్, పీఎసీఎస్, మార్క్‌ఫెడ్ కలిపి 207 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
వర్షాలతో గుబులు
వానకాలంలో మొదట వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఆలస్యంగా వర్షాలు కురవడంతో రైతన్నలకు ‘కాలం’కలిసొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారింది. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. బోరు బావుల్లో భూగర్భజలం పెరిగింది. అయితే పంట చేతికొచ్చేదశలో వర్షాలు పడితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భయాందోళనలో ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ప్రవహించి కల్హేర్, సిర్గాపూర్, నిజాంపేట్ మండలాల్లో వరి పంట నేలవాలిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
వర్షాకాలంలో భారీగా వరి సేద్యం
జిల్లాలో 1,51,511 ఎకరాల్లో సాగు
37.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా
కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
నష్టపరిహారం ఇవ్వాలని
రైతుల వినతి
పదెకరాల్లో వరి సాగు చేశాను. పంట ఆశాజనకంగా ఉంది. వరి కోతలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా. వాగు దగ్గర వరదతో కొంత పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
– పబ్బతి కిష్టారెడ్డి, రైతు, కల్హేర్
రైతన్న ఇంట సిరుల పంట


