
జోరువాన
● మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం ● చెరువులు, కుంటల్లోకి భారీగా వరద
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలో విస్తారంగా వర్షా లు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగి పొర్లాయి. పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. రోడ్లు దెబ్బతిన్నాయి. వాగులు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 23.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యఽధికంగా న్యాల్‌కల్‌లో 69 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, నిజాంపేట్‌లో 9 మిల్లీ మీటర్లు కురిసింది. రాయికోడ్‌లో 54 మిల్లీ మీటర్లు, ఝరాసంగంలో 47.7, పుల్‌కల్ 42.8, వట్‌పల్లిలో 28, మునిపల్లిలో 26.9 ఎంఎం వర్షం కురవగా, చౌటకూర్, మొగుడంపల్లిలో 24.8, అమీన్‌పూర్‌లో 22.2, ఆర్సీపురంలో 202, పటాన్‌చెరులో 20 మిల్లీ మీటర్లు వర్షం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 20 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
పొంగిపొర్లిన వాగులు
వర్షాలకు న్యాల్‌కల్ మండల పరిధిలోని చీకూర్తి, డప్పూర్, రేజింతల్ తదితర వాగులు పొంగి పొర్లాయి. చీకూర్తి వాగు పొంగి పొర్లడంతో బీదర్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. న్యాల్‌కల్ మండలం గుండా జిల్లాలోకి ప్రవేశించే మంజీర నదిలోకి వరద నీరు చేరుతుంది. ఎగువ ప్రాంతమైన కర్నాటక నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది.

జోరువాన