స్థానిక అధికారుల కనుసన్నల్లోనే యూరియా పక్కదారి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయానికి వాడుకునే యూరియా పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా వినియోగించకుండా నిరోధించేందుకు వ్యవసాయశాఖ చేపడుతున్న తనిఖీల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానిక అధికారుల కనుసన్నల్లోనే సబ్సిడీ యూరియా పక్కదారి పడుతుంటే.. ఆ అధికారులతోనే ఈ పరిశ్రమలను తనిఖీలు చేయిస్తుండటం గమనార్హం. దీంతో ఈ తనిఖీల్లో ఒక్క బస్తా కూడా పట్టుబడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. సబ్సిడీ యూరియా అక్రమ వినియోగానికి చెక్ పెట్టాలంటే స్థానికేతర అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయిస్తేనే అక్రమ వినియోగం వెలుగులోకి వచ్చే అవకాశాలుంటాయి. కానీ స్థానిక వ్యవసాయశాఖ అధికారులకే తనిఖీల బాధ్యతలు అప్పగించడంతో ఫలితం లేకుండా పోయింది.
47 పరిశ్రమల్లో తనిఖీలు..
జిల్లాలో కొన్ని పరిశ్రమలు తక్కువ ధరకు లభిస్తున్న సబ్సిడీ యూరియాను తమ పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎక్కువ ధర ఉండే టెక్నికల్ గ్రేడ్ (కమర్షల్) యూరియాను వాడాల్సిన స్థానంలో సబ్సిడీ యూరియాను వినియోగిస్తున్నారు. ఈ అక్రమ వినియోగానికి చెక్ పెట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. తనిఖీల బాధ్యతలను స్థానిక ఏఓలు, ఏడీఏలకే అప్పగించి.. వారివారి ఏరియాల్లో పరిశ్రమలను తనిఖీలు చేస్తున్నారు. కాగా వీరి కనుసన్నల్లోనే ఈ అక్రమ వినియోగం జరుగుతుంటే., అదే అధికారులతో తనిఖీలు చేయిస్తుంటే ఒక్క బస్తా కూడా పట్టుబడకపోవడం గమనార్హం. ఇప్పటివరకు జిల్లాలో 47 పరిశ్రమలను తనిఖీలు చేశామని, ఎక్కడ కూడా సబ్సిడీ యూరియా కనిపించలేదని స్థానిక వ్యవసాయ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. 20 రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో కూడా సబ్సిడీ యూరియా పట్టుబడలేదని జిల్లా వ్యవసాయశాఖాధికారి శివప్రసాద్ ‘సాక్షి’ తో పేర్కొన్నారు.
వారికే పరిశ్రమల్లో తనిఖీల బాధ్యతలు
ఒక్క బస్తా కూడా లభించలేదంటూ వెల్లడి
విమర్శలకు దారితీస్తున్న
వ్యవసాయశాఖ తీరు
38 వేల మెట్రిక్ టన్నులు అవసరం
జిల్లాలో ఈసారి 38,872 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా యూరి యా కొరత నెలకొన్న నేపథ్యంలో జిల్లాకు ఇప్పటివరకు 17,900 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్లు ఆశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఇంకా మార్క్‌ఫెడ్, ప్రైవేట్ డీలర్ల వద్ద కలిపి సుమారు 5,200 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అక్కడక్కడ యూరియా లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారు.