
వివరాలు పక్కాగా నమోదు చేయాలి
వట్‌పల్లి(అందోల్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు పీఎం ఆవాస్ యోజన యా ప్‌లో పక్కాగా నమోదు చేయాలని హౌసింగ్ పీడీ చలపతిరావు అన్నారు. గురువారం అందోల్ మండల పరిధిలోని చింతకుంటలో చేపడుతున్న పీఎం ఆవాస్ యోజన సర్వేను పరిశీలించారు. వివరాల నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివరాలు నమోదు చేసే సమయంలో లబ్ధిదారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజేశ్‌కుమార్, ఎంపీఓ సోమ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీవిద్య ఉన్నారు.
‘మత పరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం’
మెదక్‌జోన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, కానీ బీసీల ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించటం ఎంతవరకు సమంజసమని ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిశోర్‌రెడ్డి అన్నా రు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకం కాదని, మోదీ కేబినెట్‌లో ఎంతో మంది బీసీలు ఉన్నారని గుర్తుచేశారు. బీసీల మీద ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నటిస్తోందని, అదే నిజమైతే కేబినెట్‌లో ఎంత మంది బీసీలు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నేతలు ఎంఎల్‌ఎన్ రెడ్డి, సుభాష్‌గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
మోతాదుకు మించి యూరియా వాడొద్దు: ఏడీఏ
రామాయంపేట(మెదక్): అధిక మోతాదులో యూరియా వాడితే పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం దెబ్బతింటుందని ఏడీఏ రాజ్‌నారాయణ అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్‌లో జీలుగ సాగుచేస్తున్న పలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. పచ్చిరొట్ట ఎరువు వినియోగంతో దీర్ఘకాల ప్రయోజనాలున్నాయని, సీజన్‌కు ముందే రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశామన్నారు. మండలంలో మొత్తం 276 క్వింటాళ్ల మేర విత్తనాలు అమ్ముడుపోయాయని వివరించారు. తక్కువ మోతాదులో యూరియా వాడాలని తాము మండలాల వారీగా రైతులను చైతన్యపరుస్తున్నామని వివరించారు.
పూర్తిస్థాయి
నష్టపరిహారం ఇవ్వాలి
పటాన్‌చెరు టౌన్: సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 25 రోజులు దాటిందని, ఒక్కో కార్మిక కుటుంబానికి రూ. కోటి ప్రకటించి, ప్రస్తుతం రూ. 10 లక్షలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మాట్లాడుతూ... మిగిత డబ్బులు దశలవారీగా ఇస్తామనడం దారుణం అన్నారు. తక్షణమే పూర్తిస్థాయి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆచూకీ దొరకని కార్మిక కుటుంబాలకు రూ. 15 లక్షలు ఇచ్చి, వారిని స్వస్థలాలకు పంపించారని. బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించడంలో అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యం చేయటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
దరఖాస్తుల ఆహ్వానం
నర్సాపూర్ రూరల్: కౌడిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అదెప్ప గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 1, కామర్స్ 1, ఇంగ్లీష్ 1, బోటని 1, కెమిస్ట్రీ 1, ఎకనామిక్స్ 1, తెలుగు 1 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెట్, నెట్, పీహెచ్‌డీతో పాటు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. బీసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. నేడు, రేపు కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28 రోజు నిర్వహించే డెమో క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.