
నారింజకు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జహీరాబాద్: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో గల నారింజ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో షటర్లకు రెండు ఇంచుల మేర నీరు తక్కువగా ఉండగా, వర్షాలు కురుస్తుండడంతో నీరు చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో సామర్థ్యం మేరకు నీరు ఉండగా, బయటకు వెళుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో సైతం అంతేస్థాయిలో ఉంది. షటర్ల పై నుంచి రెండు ఇంచుల మేర నీరు దిగువన ఉన్న కర్షాటకలోకి వెళుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరదను నీటిపారుదల అధికారులు పరిశీలించారు.
భద్రతా చర్యలకు
ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్
సంగారెడ్డి జోన్: జిల్లాలోని పరిశ్రమలలో భద్రతా చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలశాఖ, టీజీఐపాస్ ఇండస్ట్రీయల్ జోన్లు, కార్మికుల సమస్యలు, ఫైర్‌సేఫ్టీ అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు టీజీఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావాలంటే అనుమతుల జారీ ప్రక్రియ, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తప్పనిసరి అన్నారు. జిల్లాలో సిగాచీ పరిశ్రమ లాంటి సంఘటన పునరావృతం కాకుండాఅవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.