
మీసేవకు మరో 9 సర్వీసులు
సేవలు ఇలా..
అత్యధికంగా రెవెన్యూ శాఖ నుంచి
● విద్యార్థులకు చదువుకు సంబంధించి స్టడీ గ్యాప్ సర్టిఫికెట్
● స్థానిక ధృవీకరణ పత్రాలు
● కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
● పేరు మార్పు ధ్రువీకరణ
● ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్
● హిందూ మ్యారేజ్ ధ్రువీకరణ పత్రం
● వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం
● ఇసుక బుకింగ్ సేవలను మీ సేవలో అందుబాటులోకి వస్తున్నాయి
● ఇక నుంచి ఎక్కడైనా.. ఎప్పుడైనా కుల ధ్రువీకరణ
● పారదర్శకత.. ప్రజలకు మరింత దగ్గరగా సేవలు
● పేపర్‌లెస్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత
మెదక్ కలెక్టరేట్: ప్రజలు కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వం పేపర్‌లెస్ విధానాన్ని మరింత వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజలు తమ సమస్యలపై రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా మీ–సేవల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతుంది. ప్రజాపాలన మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పేపర్‌లెస్ సేవలందిస్తున్న మీ–సేవకు ప్రభుత్వం కొత్తగా మరో 9 సేవలను అప్పగించింది. రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌లకు సంబంధించిన సేవలను మాత్రమే మీసేవ కేంద్రాలు అందిస్తున్నాయి. కొత్తగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నుంచి ఒకటి, అటవీశాఖ నుంచి రెండు, రెవెన్యూశాఖ నుంచి ఆరు రకాల సేవలను ప్రభుత్వం మీసేవలో పొందు పర్చింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయనే చెప్పాలి.
పాన్‌కార్డులో మార్పులు.. చేర్పులు
ప్రస్తుతం చాలా మంది ప్రజలు తమ పాన్‌కార్డులలో తప్పులు దొర్లడంతో వాటి మార్పులు, చేర్పుల కోసం సరైన సమాచారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలా చేసుకోవాలో తెలియక నానా హైరానా పడుతున్నారు. పాన్‌కార్డు సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి అలసి పోతున్నారు. ప్రభుత్వం నూతనంగా మీసేవ ద్వారానే పాన్‌కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే సర్వీస్‌ను అమలులోకి తీసుకొస్తుంది. దీంతో పాన్‌కార్డు సమస్యలతో బాధపడుతున్న ప్రజల సమస్యకు పరిష్కారం దొరకనుంది.
అటవీశాఖకు సంబంధించి..
అటవీ జంతువుల దాడిలో చనిపోయి. మనుషులు, పశువులకు పరిహారం దరఖాస్తులు
కట్టెల మిల్లులు, కట్టెల డిపోలకు సంబంధించిన దరఖాస్తులు
సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నుంచి సీనియర్ సిటిజన్ మెయింటెన్స్, మానిటరింగ్ సిస్టం దరఖాస్తులు మీసేవలో ప్రభుత్వం పొందు పర్చింది. ప్రజలు తమ కావాల్సిన పత్రాల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు సమర్పిస్తే చాలు. నిర్ణీత సమయంలోనే ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు.