
డిజిటల్ రీసర్వే వేగవంతం చేయాలి
వట్‌పల్లి (అందోల్): డిజిటల్ రీసర్వే ద్వారా కచ్చితమైన సమాచారం నమోదు చేయడంతోపాటు భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే అవకాశముందని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని షాద్‌నగర్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ రీసర్వే కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటల్ రీసర్వే ద్వారా వివరాల నమోదు, సర్వేలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో బేస్మెంట్ లెవెల్‌వరకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటల్ రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ములుగు, ఖమ్మం, జగిత్యాల, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాలతోపాటు జిల్లాలోని వట్‌పల్లి మండలం, షాద్‌నగర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. గ్రామరైతులు భూసమస్యలు ఉంటే డిజిటల్ రీసర్వేలో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిర్మాణ పనులు పూర్తి చేయడంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు ఐనేష్, ఆర్డీఓ పాండు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో అంజయ్య, సర్వేయర్ మురళీతోపాటు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య