
పాత్రికేయ వృత్తి.. సామాజిక బాధ్యత
సిద్దిపేటజోన్: జర్నలిజం అనేది వృత్తి కాదని అది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి జర్నలిస్ట్ గుర్తించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విపంచి ఆడిటోరియంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు నైతిక నియమాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి, పాలనా యంత్రాంగానికి మధ్య ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారధి లాంటిదని అభివర్ణించారు. పాత్రికేయ వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
పాఠకుల అభిరుచులకు అనుగుణంగా..
నైతిక నియమావళి–మీడియా, చట్టాలు అనే అంశంపై రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ట్రెండ్ మారిందని, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాలని పేర్కొన్నారు. సాంకేతికతను సమగ్రంగా తెలుసుకుంటే వార్తల సేకరణ సులభం అవుతుందన్నారు. అంతకుముందు తెలంగాణ జర్నలిజం, గతం, వర్తమానం, భవిష్యత్, మీడియా ధోరణులు అనే అంశంపై సంపాదకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొవిడ్ ముందు.. తర్వాత పత్రికల్లో మార్పులు వచ్చాయన్నారు. సోషల్ మీడియా యూట్యూబ్‌లో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఫేక్ న్యూస్, సైబర్ క్రైం, సోషల్ మీడియా అంశంపై మాట్లాడారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి నేర వార్తలు అంశంపై వివరించారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా శిక్షణ పొందిన వారికి అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఆర్డీఏ జయదేవ్ ఆర్య, జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు రంగాచారి, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
పాలన యంత్రాంగం,
ప్రజలకు మధ్య వారధి
కలెక్టర్ హైమావతి

పాత్రికేయ వృత్తి.. సామాజిక బాధ్యత