
విద్యార్థినికి గోల్డ్ మెడల్
వెల్దుర్తి(తూప్రాన్): స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సదాల లిఖిత జిల్లాస్థాయి పరుగు పందెంలో బంగారు పతకం సాధించిందని హెచ్‌ఎం సాంబయ్య తెలిపారు. మెదక్ ఇందిరాగాంధీ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన 60 మీటర్ల పరుగులో ఆమె జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా డీఈఓ రాధాకిషన్ శనివారం ఆమెకు బహుమతి అందజేశారు. విద్యార్థిని లిఖితతోపాటు శిక్షణ ఇచ్చిన పీడీ శ్రీనివాసరావును అభినందించారు.
వన్యప్రాణుల వేట.. అరెస్టు
నర్సాపూర్: వన్యప్రాణులు వేటాడిన ఇద్దరిని శనివారం అరెస్టు చేసినట్లు స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి అరవింద్ పేర్కొన్నారు. వివరాలు ఇలా... నర్సాపూర్ రేంజ్ పరిధిలోని వెంకట్రావ్‌పేట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్‌కు చెందిన రామ్, వెంకట్రావ్‌పేటకు చెందిన రమేష్ వన్యప్రాణులను వేటాడారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అధికారులను రేంజ్ అధికారి అభినందించారు.
నెమలిని కాపాడిన రైతు
కొమురవెల్లి(సిద్దిపేట): కుక్కల దాడిలో గాయపడిన నెమలిని రైతు కాపాడి అటవీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన మండలంలోని గౌరయపల్లిలో చోటు చేసుకుంది. శనివారం గ్రామానికి చెందిన కొయ్యడ మల్లేశం తన వ్యవసాయ బావి వద్ద కుక్కలు నెమలిని గాయపరచగా నెమలిని కాపాడి అటవీ అధికారులకు సమాచారం అందించడంతో వారు గోపాలమిత్ర సాయిలును పంపించారు. అతడు గాయపడి నెమలికి చికిత్స అందించి ఫారెస్టు అధికారులకు అప్పగించారు. అనంతరం నెమలిని కొండపాక ఆనంద నిలయం సమీపంలోని అడవిలో వదిలిపెట్టినట్లు సెక్షన్ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు.
చిరుత సంచారం
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని జంగపల్లి, అల్మాజీపూర్, దౌల్తాబాద్ మండలం గాజులపల్లి, దొమ్మాట గ్రామాల శివారు అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో శనివారం ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళన నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం ఆయా గ్రామాల రైతులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికొస్తున్న క్రమంలో దారి పొడవునా ఏదో గుర్తు తెలియని జంతువు పెద్ద పెద్ద కాలి గుర్తులు కనిపించాయి. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే దుబ్బాక అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మధుబాల నేతృత్వంలో జంతువు కాలి గర్తులను పరిశీలించారు. కాలి గుర్తులను మ్యాప్‌ల ఆధారంగా పరిశీలించడంతో ఏడాదిన్నర వయసు కలిగిన చిరుత పులి కాలి గుర్తులుగా నిర్ధారణకు వచ్చారు. కాగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం చిరుత పులి కదలికలను పసిగట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

విద్యార్థినికి గోల్డ్ మెడల్