
శ్రీచైతన్య పాఠశాలకు షోకాజ్ నోటీసులు
● యునిఫాంలు ఉన్న గది సీజ్ ● ఎంఈఓ సత్యనారాయణ
తూప్రాన్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న శ్రీచైతన్య పాఠశాలను ఎంఈఓ సత్యనారాయణ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే పాఠశాలకు ప్రీ–ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ 9వ తరగతి నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా తొమ్మిదో తరగతి నడుపుతున్నట్లు గుర్తించినట్లు ఎంఈఓ తెలిపారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో యూనిఫాంలు విక్రయం కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత పాఠశాల యాజమాన్యానికి తక్షణమే 9వ తరగతిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసి, యునిఫాంలు ఉన్న గదిని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పిల్లలను చేర్పించాలని సూచించారు.