
ఆయిల్‌పామ్ సాగు రాయితీ బాగు..
ఆసక్తి చూపుతున్న రైతులు
● లక్ష్యం 3,750 ఎకరాలు ● 2 వేల ఎకరాల్లో సాగు
జహీరాబాద్ టౌన్: ఒకప్పుడు ధరలేక సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదు. వందశాతం లాభాల భరోసా కల్పిస్తూ ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడంతో ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వంట నూనెల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. రైతులను ప్రోత్సహించేందుకు గెలల ధరలు పెంచుతోంది. రాయితీ సొమ్మును జమ చేస్తుండటంతో ఆయిల్ పామ్ తోటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో పలువురు రైతులు ఆయిల్ పామ్ తోటలను పెంచడానికి ముందుకు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాగు విస్తీర్ణం పెంచడానికి సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్‌ను అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. తెగుళ్లు, చీడ పురుగుల ప్రభావం తక్కువగా ఉంటుంది. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. తోటలో అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. మొక్కలు నాటిన నాలుగో ఏడాది నుంచి పంట మొదలై 30 ఏళ్లపాటు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది.
రేండేళ్లుగా ముమ్మరంగా..
రెండు, మూడేళ్ల నుంచి ఆయిల్ పామ్ సాగు ముమ్మరంగా సాగవుతుంది. జిల్లాలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంఘం మండలాల్లోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 2వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి 3,750 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2,500 ఎకరాలకు రైతుల పేర్లను నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 1,045 ఎకరాలకు పరిపాలన మంజూరు కూడా వచ్చింది. ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలు 100 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై ఐదు హెక్టార్ల వరకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తుంది.
పెరిగిన ధరలు
ఆయిల్ పామ్ గెలల ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు రూ. 20,506 ఉండగా తాజాగా టన్నుకు రూ. 20,871కి చేరుకుంది. ఐదారు నెలల్లో రూ. 365 పెరిగింది. మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా గోద్రేజ్ కంపెనీ వారు గెలలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పదం చేసుకుంది.
వందశాతం భరోసా
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పంట వల్ల భవిషత్యలో లబ్ధి చేకూరుతుంది. సాగు చట్టబద్ధతతో కూడుకుంది. గెలలను గోద్రేజ్ కంపెనీ కొనుగోలు చేస్తుంది. సాగు కోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంఘం మండలాల్లోని రైతులు సాగులో ముందున్నారు. మిగతా ప్రాంత రైతులు ముందుకురావాలి.
–సోమేశ్వర్‌రావు, ఉద్యానశాఖ జిల్లా డీడీ, సంగారెడ్డి

ఆయిల్‌పామ్ సాగు రాయితీ బాగు..