
బెట్టింగ్, డ్రగ్స్‌ను తరిమికొట్టాలి
● శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ ● మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్
అల్లాదుర్గం(మెదక్): బెట్టింగ్, డ్రగ్స్‌ను యువత తరిమికొట్టాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావ్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, 10 మంది ఎస్‌ఐలు, 110 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సోదాలు చేపట్టారు. సరైన ధ్రువ పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, 2 బులోరా వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. బెట్టింగ్ యాప్‌లతో ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నారని తెలిపారు. కార్డెన్ సెర్చ్‌తో గ్రామాల్లో ఎవరైన సంఘ విద్రోహ శక్తులు తల దాచుకుంటే పట్టుకునే అవకాశం ఉందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.